వారు స్వాధీనపరచుకొనునట్లు నేను వారి కిచ్చుచున్న దేశమందు వారు ఆలాగు ప్రవర్తింపవలెను.
కాబట్టి మీరు కుడికే గాని యెడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను.
నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధులచొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి .
నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.
కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.