మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.
నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.
చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.
తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.
నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.
ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.
వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకము నకు ఆరోహణుడాయెను .
ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.
అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నదిగదా.
దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటె మరిపైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.
ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.