ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.
ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.
అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.
ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊదిపరిశుద్ధాత్మమ పొందుడి.
మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.
యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను
గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడునేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.
ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.
తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.
అందుకు తోమా ఆయనతోనా ప్రభువా, నా దేవా అనెను.
యేసు నీవు నన్ను చూచి నమి్మతివి, చూడక నమి్మనవారు ధన్యులని అతనితో చెప్పెను.
అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా
సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును,జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.
సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారుమేమును నీతో కూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.
సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.
యేసు పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,
లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయనదోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.
కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడుఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.
దరి యించుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.
వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.
యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా
సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;
చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసురండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందుననీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.
యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.
యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.
వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.
మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన నా గొఱ్ఱలను కాయుమని చెప్పెను.
మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూనన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడిప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.
యేసు నా గొఱ్ఱలను మేపుము. నీవు ¸యవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవ నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొనిపోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను.
అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పినన్ను వెంబడించుమని అతనితో అనెను.
పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొనిప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను.
పేతురు అతనిని చూచి ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను.
యేసు నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను.
కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గానినేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.
ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారికగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.
దేవుడాయనను మూడవ దినమున లేపి
ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.
ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.
అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.
తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.
అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;
ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.
నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.
తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి
తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.
ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను.
ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.
మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.