మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును
మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
ఆయన మరల మనయందు జాలిపడును , మన దోషములను అణచివేయును , వారి పాపము లన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు .
మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.
అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.
కీడు వలన జయింప బడక , మేలు చేత కీడును జయించుము .
కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు.
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.
ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.
కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.