వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదె గాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు.
యెహెజ్కేలు 13:23

మీరికను వ్యర్థమైన దర్శనములు కన కయుందురు , సోదె చెప్పక యుందురు; నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు నా జనులను మీ వశము నుండి విడిపించెదను .

1 రాజులు 22:11-13
11

కెనయ నా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.

12

ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచు యెహోవా రామోత్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి.

13

మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా

1 రాజులు 22:17-13
సామెతలు 26:28

అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.

యిర్మీయా 14:13-16
13

అందుకు నేను అయ్యో, ప్రభువైన యెహోవామీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చెదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారవి నేననగా

14

యెహోవా నాతో ఇట్లనెనుప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయ మునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.

15

కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు.

16

వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయ బడెదరు; నేను వారి చెడుతనమును వారిమీదికి రప్పించెదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టువాడెవడును లేక పోవును.

యిర్మీయా 23:14-29
14

యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్యవర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.

15

కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలనుగూర్చి సెలవిచ్చునదేమనగాయెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చు చున్నాను.

16

సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీకు ప్రచనములు ప్రకటించు ప్రవక్తలమాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు.

17

వారు నన్ను తృణీకరించు వారితోమీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితోమీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాట లాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.

18

యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?

19

ఇదిగో యెహోవాయొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్లుచున్నది; అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తలమీదికి పెళ్లున దిగును.

20

తన కార్యమును సఫలపరచువరకును తన హృదయా లోచనలను నెరవేర్చువరకును యెహోవా కోపము చల్లారదు; అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు.

21

నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.

22

వారు నా సభలో చేరిన వారైన యెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియ జేతురు, దుష్‌క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి పెట్టునట్లు వారిని త్రిప్పియుందురు; ఇదే యెహోవా వాక్కు.

23

నేను సమీపముననుండు దేవుడనుమాత్ర మేనా? దూరముననుండు దేవుడనుకానా?

24

యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యా కాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.

25

కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.

26

ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలో చింపరా?

27

బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?

28

కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.

29

నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?

విలాపవాక్యములు 2:14

నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచి యున్నారు నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.

జెకర్యా 13:2-4
2

ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు -ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండ దేశము లోనుండి నేను వాటిని కొట్టివేతును ; మరియు ప్రవక్తలను అపవి త్రాత్మను దేశము లో లేకుండచేతును .

3

ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలి దండ్రులు -నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే ; నీవికను బ్రదుక తగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలి దండ్రు లే వాని పొడుచుదురు.

4

ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు .

రోమీయులకు 16:18
అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
1 థెస్సలొనీకయులకు 2:5

మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.

2 పేతురు 2:2

మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.

2 పేతురు 2:3

వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.