నీ పుత్రసంతును
2 రాజులు 24:12

అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతులును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.

2 రాజులు 25:6

వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసికొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను.

2 రాజులు 25:7

సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి.

2 దినవృత్తాంతములు 33:11

కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి.

2 దినవృత్తాంతములు 36:10

ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహోదరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేముమీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను.

2 దినవృత్తాంతములు 36:20

ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనే యుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.

యిర్మీయా 39:7

అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.

యెహెజ్కేలు 17:12-20
12

తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.

13

మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండు నట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును,

14

అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమవంతులను తీసికొనిపోయెను.

15

అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు

16

ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

17

యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలువేసి బురుజులు కట్టిన సమయమున, ఫరో యెంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు.

18

తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు.

19

ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తలమీదనే మోపుదును,

20

అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాస ఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును.

నపుంసకులగా చేయుటకై
దానియేలు 1:2-7
2

ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను , ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతా లయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను.

3

రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను -ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,

4

తత్వ జ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువ దగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము .

5

మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానముచేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి , మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.

6

యూదులలోనుండి దానియేలు , హనన్యా , మిషాయేలు , అజర్యా అనువారు వీరిలోనుండిరి .

7

నపుంసకుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు , మిషాయేలునకు మేషాకనియు , అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను .