వచ్చు దినములలో ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోనురాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొని పోవుదురు.
అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధానము సత్యము కలిగిన యెడల మేలేగదా అని యెషయాతో అనెను.
మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున తునకలుగా చేయించి యెత్తికొని పోయెను.
మరియు యెహోవా మందిరమందున్న యిత్తడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి.
సేవకొరకై యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొనిపోయిరి.
అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను.
ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహోదరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేముమీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను.
మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను.
ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదా రాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.
యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు ననే సెలవిచ్చుచున్నాడు
అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు.
మరియు యెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు గొనిపోయిరి.
అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని గొనిపోయిరి.
మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను.
ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను , ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతా లయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను.