నా ప్రాణము సింహములమధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.
కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
దేశములో ఉండకుండ వారు దరిద్రులను మింగునట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయునట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లునుగలవారి తరము కలదు.
విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచు దురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉప యోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.
నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.
మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని
యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.
దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు
పారు నీళ్లవలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును.