శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.
సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును.
నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును.
దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.
దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.
యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది .
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును.
సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా,మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.
రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు ? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.
నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి ? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి?
ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని , జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది , నా బట్ట లన్నియు డాగులే .
పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను
నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను .
కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని .
ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.
మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.
మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు
ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;
రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.
పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱములెక్కి ఆయనను వెంబడించుచుండిరి.
జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.
మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని.
అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి -రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.
మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.
అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనినవారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
కడమవారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.