ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామానుయొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడునట్లుగాను సెలవియ్యుడనెను.
ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామానుయొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి.
అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు ధృఢపరచుకొన్నవాడెవడు? వాడేడి? అని రాణియగు ఎస్తేరు నడుగగా
ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను.
రాజు ఆగ్రహమొంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హానిచేయ నుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణముకొరకు విన్నపము చేయుటకై నిలిచెను.
నగరువనములోనుండి ద్రాక్షారసపు విందుస్థలమునకు రాజు తిరిగిరాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.
రాజు ముందర నుండు షండులలో హర్బోనా అను నొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తుగల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడియున్నదనగా రాజు దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.
కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరికొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.
ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణియైన ఎస్తేరునకిచ్చెను ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియజేసినమీదట అతడు రాజు సన్నిధికి రాగా
రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిమీద అధికారిగా ఉంచెను.
మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా
రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి
రాజవైన తమకు సమ్మతియైనయెడలను,తమ దృష్టికి నేను దయపొందినదాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచిన యెడలను, తమ దృష్టికి నేను ఇంపైనదాననైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలోనుండు యూదులను నాశనముచేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.
నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవిచేయగా
రాజైన అహష్వేరోషు రాణియైన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెలవిచ్చెను హామాను ఇంటిని ఎస్తేరున కిచ్చియున్నాను; అతడు యూదులను హతముచేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్యమీద ఉరితీయబడెను.
అయితే రాజుపేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు; కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి.
సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.
రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుఱ్ఱములమీద, అనగా రాజనగరుపనికి పెంచబడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీదులను వారిచేత పంపెను.
రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని, తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆ యా ప్రదేశములలోనుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరిని, శిశువులను స్త్రీలను కూడ, సంహరించి హతముచేసి నిర్మూలపరచి
వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.
మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆ యా సంస్థానములలోని జనులకందరికి పంపించవలెననియు,యూదులు తమ శత్రువులమీద పగతీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను.
రాజ నగరుపనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాటవలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.
వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చియున్నది . దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను .
తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది
నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక
నేను తప్పించుకొనిపోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక.
మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలి చేయుననెను.