పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.
యెహోవా ఇశ్రాయేలీయులనుగూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడిన యెడల నీవు వృద్ధిపొందుదువు; ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము; భయపడకుము దిగులుపడకుము.
మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణముచేసిన దేశమునకు నీవు వీరితోకూడ పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను.
నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకు మని ఇశ్రాయేలీయులందరియెదుట అతనితో చెప్పెను.
నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.
అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.
ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.
నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి;
యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.
నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
ఇట్లుండగా ఏమందుము ? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి యెవడు ?
నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.
ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.