కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి.
నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.
ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును.
నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.
ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము.
దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.
ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
మనము దేవుని సంబంధులమనియు,లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.
మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.