
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.
మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి;
కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువు నందు స్థిరులై యుండుడి.
సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము.
మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకముచేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను.
సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.
ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.
ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.