నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు?
మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
ఇందువిషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనముచేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను.
ఆ దినములలో అహీతోపెలు చెప్పిన యే యాలోచనయైనను ఒకడు దేవుని యొద్ద విచారణచేసి పొందిన ఆలోచనయైనట్టుగా ఉండెను; దావీదును అబ్షాలోమును దానిని అట్లే యెంచుచుండిరి.
అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పినదానికంటె యుక్తమని యొప్పుకొనిరి; ఏలయనగా యెహోవా అబ్షాలోముమీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థముచేయ నిశ్చయించియుండెను.
అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి, గాడిదకు గంతకట్టి యెక్కి తన ఊరనున్న తన యింటికి పోయి తన యిల్లు చక్కబెట్టుకొని ఉరిపోసికొని చనిపోయెను; జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి.
ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొనిపోవును.న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.
వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.
భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థకపరచును త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడచేయును.
నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.
వారి అవివేక హృదయము అంధకారమయమాయెను ; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి .