అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;
తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోనునొద్దకు పంపెను; ఏలయనగా హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా నుండెను.
హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను.
యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచు వరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.
తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేకపోయెనన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసియున్నాడు.
కాబట్టి నీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రియైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను.
లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక
నీ యేర్పాటుచొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానముగల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి
సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను నీవు నాయొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.
నా సేవకులు వాటిని లెబానోనునుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు; అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రముమీద చేరునట్లు చేసి, అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసికొందువు. ఇందునుగూర్చి నీవు నాకోరిక చొప్పున జరిగించి నా యింటివారి సంరక్షణకొరకు ఆహారము ఇచ్చెదవు.
హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా
సొలొమోను హీరామునకును అతని యింటివారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను.
యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను; మరియు హీరామును సొలొమోనును సంధిచేయగా వారిద్దరికి సమాధానము కలిగియుండెను.
రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,
వీరిని అతడు వంతులచొప్పున నెలకు పది వేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.
మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎనుబది వేలమందియు నుండిరి.
వీరు కాక పనిమీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.
రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.
ఈలాగున సొలొమోను పంపినవారును గిబ్లీయులును, హీరాము శిల్పకారులును మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి.
అయితే ఇశ్రాయేలీయులు ఇగుప్తుదేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగువందల ఎనుబదియవ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్ అను రెండవ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప నారంభించెను.
నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను;
పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.
రాజైన సొలొమోను తూరు పట్టణములోనుండి హీరామును పిలువనంపించెను.
ఇతడు నఫ్తాలిగోత్రపు విధవరాలి కుమారుడై యుండెను; ఇతని తండ్రి తూరు పట్టణపువాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోను బహు చమత్కారపు పనివాడునై యుండెను; అతడు సొలొమోనునొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను.
ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివిగలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది.
మరియు స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒకపీటయొక్క యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు.
మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను.
ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను.
మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను.
మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టునుండెను.
ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.
ఈ స్తంభములమీద తామరపుష్పములవంటి పని యుండెను; ఈలాగున స్తంభములయొక్క పని సమాప్తమాయెను.
మరియు అతడు పోతపనితో ఒక సముద్రమును చేసెను; అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచువరకు పది మూరలు, అది అయిదుమూరల యెత్తుగలదై గుండ్రముగా ఉండెను; దాని కైవారము ముప్పది మూరలు.
దాని పై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను; మూరకు పది గుబ్బలచొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టును ఆవరించియుండెను; అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోత పోయబడెను.
అది పండ్రెండు ఎడ్లమీద నిలువబడియుండెను; వీటిలో మూడు ఉత్తరదిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణదిక్కును మూడు తూర్పుదిక్కును చూచుచుండెను. వీటిమీద ఆ సముద్రము ఎత్తబడి యుండెను. వాటి వెనుకటి భాగములన్నియు లోపలితట్టు త్రిప్పబడి యుండెను.
అది బెత్తెడు దళసరిగలదై యుండెను; దాని పై అంచు పాత్రకు పై అంచువలె తామర పుష్పములవంటి పని కలిగి యుండెను; అది తొమి్మది గరిసెలు పట్టును.
మరియు అతడు పది యిత్తడి స్తంభములు చేసెను; ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు, నాలుగు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు కలిగి యుండెను.
ఈ స్తంభముల పని రీతి యేదనగా, వాటికి ప్రక్క పలకలు కలవు, ఆ ప్రక్కపలకలు జవలమధ్య ఉండెను.
జవలమధ్యనున్న ప్రక్కపలకలమీద సింహములును ఎడ్లును కెరూబులును ఉండెను; మరియు జవలమీద ఆలాగుండెను; సింహములక్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండలవంటి పని కలిగి యుండెను.
మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి యిత్తడి చక్రములు ఇత్తడి యిరుసులును కలిగి యుండెను; దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు; ఈ దిమ్మలు తొట్టిక్రింద అతికిన ప్రతిస్థలము దగ్గర పోత పోయబడెను.
మరియు దాని మూతి పైపీటయందును మీదను మూరెడు నిడివి; అయితే మూతి క్రింద స్తంభము పనిచొప్పున గుండ్రముగా ఉండి మూరన్నర నిడివి. మరియు ఆ మూతిమీద ప్రక్కలుగల చెక్కిన పనులు గలవు; ఇవి గుండ్రనివిగాక చచ్చౌకముగా ఉండెను.
మరియు ప్రక్కపలకల క్రింద నాలుగు చక్రములు కలవు; చక్రముల యిరుసులు స్తంభములతో అతకబడి యుండెను; ఒక్కొక్క చక్రము మూరెడునర నిడివి గలదై యుండెను.
ఈ చక్రముల పని రథ చక్రముల పనివలె ఉండెను, వాటి యిరుసులును అడ్డలును పూటీలును ఆకులును పోతపనివై యుండెను.
ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు; ఈ దిమ్మలును స్తంభమును ఏకాండముగా ఉండెను.
మరియు స్తంభమును పైని చుట్టును జేనెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగియుండెను; మరియు స్తంభమును పైనున్న జవలును ప్రక్క పలకలును దానితో ఏకాండముగా ఉండెను.
దాని జవల పలకలమీదను, దాని ప్రక్క పలకలమీదను, అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను.
ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేసెను; అన్నిటి పోతయును పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను.
తరువాత అతడు పది యిత్తడి తొట్లను చేసెను; ప్రతి తొట్టి యేడువందల ఇరువది తూములు పట్టునది; ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు; ఒక్కొక్క స్తంభముమీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను.
మందిరపు కుడిపార్శ్వమున అయిదు స్తంభములను మందిరముయొక్క యెడమ పార్శ్వమున అయిదు మట్లను అతడు ఉంచెను;సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పుతట్టున మందిరముయొక్క కుడిపార్శ్వమున ఉంచెను.
మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞనుబట్టి యెహోవా మందిరపు పనియంతయు ముగించెను.
రెండు స్తంభములను, ఆ రెండు స్తంభముల మీదనున్న పైపీటల పళ్లెములను ఆ స్తంభములను పై పీటల పళ్లెములను కప్పిన రెండు అల్లికలను,
ఆ స్తంభముల మీదనున్న పైపీటల రెండు పళ్లెములను కప్పిన అల్లిక యొక్కటింటికి రెండు వరుసలచొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మపండ్లను,
పది స్తంభములను, స్తంభములమీద పది తొట్లను,
ఒక సముద్రమును, సముద్రముక్రింద పండ్రెండు ఎడ్లను,
బిందెలను, చేటలను, గిన్నెలను వీటినన్నిటిని రాజైన సొలొమోను ఆజ్ఞనుబట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన యిత్తడివై యుండెను.
యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతానునకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోత పోయించెను.
అయితే ఈ ఉపకరణములు అతివిస్తారము లైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను;ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.
మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను,
గర్భాలయము ముందర కుడిపార్శ్వమున అయిదును, ఎడమ పార్శ్వమున అయిదును, పది బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదెలను, కారులను,
మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమను అతి పరిశుద్ధమైన స్థలముయొక్క తలుపులకును మందిరమను ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్నిటిని చేయించెను,
ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను.
తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చియున్నాడు. నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా నియమింపబడి, యెహోవా సెలవుచొప్పున ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడనై యుండి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించియున్నాను.
అతనితో ఇట్లనుము-సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా-చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.
అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.