
యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.
అతడు ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలుపరచబడి యుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయము లోనికి వచ్చెను.
అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలి దండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు
అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను
నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టియున్నాను.
తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.
తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.
ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.
మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించిమెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.)
ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు.
ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి.
నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను.
సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా
ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.
మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి,
నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.
నేను మృతిపొందిన తరువాత3 కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.
ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు,
నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.
యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను.
పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది.
ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తనదాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి.
కాగా అతడుఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని
వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి.
తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.
కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.
అప్పుడతడుపెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు.
గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.
ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారి నందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను.
రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి
స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను.
అంతట రాజువీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.
కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది.
వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు.
బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు.
బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి.
పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించు చుండిరి.
అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.
అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని
బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి.
అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.
వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;
అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా
అతడుమిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
ఆ దినమై నను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతులనుండియు నా వ్రేళ్లనుండియు జటామాంసి గడియలమీద స్రవించెను
నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు.
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.