మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతిష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను; అభిషేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.
అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్నిటిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరిశుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను.
ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన.
అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీ యుల నుండి అహరోనుకును అతని కుమారులకు నగును . అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలుల లోనుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును .
దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము.
అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతివస్తువు పరిశుద్ధమగును.
పాపపరిహారార్థబలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను.
అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తముచేయు యాజకునిదగును.
ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును.
పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును.
అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.
ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా
వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంటలను అర్పింపవలెను.
ఆ పిండివంటలేకాక సమాధానబలిరూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.
మరియు ఆ అర్పణములలో ప్రతిదానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.
కావున మీరు పరిశుద్ధస్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని.
ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటి వలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైనవాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను.
నీవు వారితో ఇట్లనుము మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రతగలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించువాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను.
యాజకులు పొందవలసిన దేదనగా, కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కియ్యవలెను.
నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱల మొదటి బొచ్చును అతని కియ్యవలెను.
నైవేద్యములును పాపపరిహారార్థ బలిమాంసమును అపరాధ పరిహారార్థ బలిమాంసమును వారికి ఆహారమవును , ఇశ్రాయేలీయులచేత దేవునికి ప్రతిష్టితములగు వస్తువులన్నియు వారివి .
మీ ప్రతిష్ఠితార్పణము లన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు , ప్రథమ ఫలము లన్నిటిలోను మొదటివియు యాజకుల వగును ; మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండిముద్దను యాజకుల కియ్యవలెను .
మానవుడు దేవుని యొద్ద దొంగిలునా ? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి ; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.
ఈ జను లందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.
నా మందిరము లో ఆహార ముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి ; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి ,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు .
ఎవడైనను తన సొంత ఖర్చుపెట్టుకొని దండులో కొలువుచేయునా? ద్రాక్షతోటవేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు?
ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రముకూడ వీటిని చెప్పుచున్నదిగదా?
కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?
కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.
మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా?
ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.
ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలిపీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా?