ఆయనను విసర్జింపకుడి , ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింప లేని మాయా స్వరూపములను అనుసరించుదురు . నిజముగా అవి మాయయే .
వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను,ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులై వారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.
నేను యెహోవాను నమ్ముకొని యున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు.
నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము.
తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.
అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించి పోవును,
యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పు దురు.
చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజన మేమి ? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి ? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి ?
కఱ్ఱనుచూచి మేలుకొమ్మనియు , మూగ రాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ ; అది ఏమైన బోధింపగలదా ? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు .
అయితే యెహోవా తన పరిశు ద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక .