Edom
యెహెజ్కేలు 25:1-17
1

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2

నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారినిగూర్చి యీ మాట ప్రవచింపుము.

3

అమ్మోనీయులారా , ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి . ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నా పరిశుద్ధస్థలము అపవిత్రపరచ బడినప్పుడు , ఇశ్రాయేలీయుల దేశము పాడుచేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు , మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక

4

నేను మిమ్మును తూర్పుననుండు మనుష్యులకు స్వాస్థ్యముగా అప్పగించెదను , వారు తమ డేరాలను మీ దేశములోవేసి మీ మధ్య కాపురముందురు , వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు .

5

నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసెదను , అమ్మోనీయుల దేశమును గొఱ్ఱల దొడ్డిగా చేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు .

6

మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలతన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు

7

నేను మీకు విరోధినై , మిమ్మును జనములకు దోపుడుసొమ్ముగా అప్పగింతును , అన్యజనులలో ఉండకుండ మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండ మిమ్మును నశింపజేతును సమూలధ్వంసము చేతును.

8

మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇతర జనము లన్నిటికిని యూదా వారికిని భేద మేమి యని మోయాబీయులును శేయీరు పట్టణపు వారును అందురు గనుక

9

తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని , అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును ;

10

జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు .

11

నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసికొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును.

12

మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చుకొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

13

ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువులేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును,దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

14

నా జనులైన ఇశ్రాయేలీయులచేత ఎదోము వారిమీద నా పగ తీర్చుకొందును, ఎదోమీయుల విషయమై నా కోపమునుబట్టియు నా రౌద్రమునుబట్టియు నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురు, ఎదోమీయులు నా క్రోధము తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

15

మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఫీలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశము చేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక

16

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఫిలిష్తీయులమీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలముచేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను.

17

క్రోధముతో వారిని శిక్షించి వారిమీద నా పగ పూర్తిగా తీర్చుకొందును; నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

యెహెజ్కేలు 35:1-15
1

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2

నర పుత్రుడా , శేయీరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని

3

దానికి మాట యెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా శేయీరు పర్వతమా , నేను నీకు విరోధినైతిని , నా హస్తము నీమీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను .

4

నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను , నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై యున్నానని నీవు తెలిసికొందువు .

5

ఇశ్రాయేలీయుల యెడల ఎడతెగని పగ కలిగి , వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి గనుక

6

నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసెదను , రక్తము నిన్ను తరుమును , రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును , ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .

7

వచ్చువారును పోవువారును లేకుండ అందరిని నిర్మూలముచేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును .

8

అతని పర్వతములను హతమైనవారితో నింపుదును , నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగు లన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు .

9

నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్ట బడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును .

10

యెహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములును ఆ రెండు దేశములును మనవే ; మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే ;

11

నా జీవముతోడు నీవు వారి యెడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి , నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును .

12

అవి పాడైనవి , మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నియు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు .

13

పెద్ద నోరు చేసికొని మీరు నామీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను .

14

ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా లోక మంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను .

15

ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసెదను ; శేయీరు పర్వతమా , నీవు పాడవు దువు , ఎదోము దేశము యావత్తును పాడైపోవును , అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు .

ఆదికాండము 25:30

నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.

ఆదికాండము 36:1-19
1

ఎదోమను ఏశావు వంశావళి ఇదే,

2

ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,

3

ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియు నైన బాశెమతును పెండ్లియాడెను.

4

ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.

5

అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే.

6

ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను;

7

వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.

8

అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము.

9

శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే,

10

ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్యయైన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్యయైన బాశెమతు కుమారుడగు రగూయేలును.

11

ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని.

12

ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు.

13

రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.

14

ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు.

15

ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,

16

కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు.

17

వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.

18

వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు.

19

ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు.

యెషయా 34:1-17
1

రాష్ట్రములారా , నాయొద్దకు వచ్చి వినుడి జనములారా , చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టిన దంతయు వినును గాక.

2

యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చు చున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చు చున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను .

3

వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపు కొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును .

4

ఆకాశ సైన్య మంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును . ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్య మంతయు రాలిపోవును .

5

నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోము మీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనము మీద తీర్పుతీర్చుటకు అది దిగును

6

యెహోవా ఖడ్గము రక్త మయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్పబడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.

7

వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడెలును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది .

8

అది యెహోవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము .

9

ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును .

10

అది రేయిం బగళ్లు ఆరక యుండును దాని పొగ నిత్యము లేచును అది తర తరములు పాడుగా నుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు

11

గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించుకొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.

12

రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు దాని అధిపతు లందరు గతమై పోయిరి .

13

ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును

14

అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును

15

చిత్తగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడుకొనును .

16

యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదియు లేక యుండదు దేని జతపక్షి దానియొద్ద ఉండక మానదు నా నోటనుండి వచ్చిన ఆజ్ఞ యిదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును .

17

అవి రావలెనని ఆయన చీట్లు వేసెను ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును . అవి నిత్యము దాని ఆక్రమించుకొనును యుగ యుగములు దానిలో నివసించును .

యెషయా 63:1-6
1

రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు ? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.

2

నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి ? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి?

3

ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని , జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది , నా బట్ట లన్నియు డాగులే .

4

పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

5

నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను .

6

కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని .

యిర్మీయా 49:7-22
7

సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?

8

ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయులారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగుకొనుడి.

9

ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా?

10

నేను ఏశావును దిగంబరినిగా చేయు చున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు, అతడును లేకపోవును.

11

అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.

12

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగు చున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.

13

బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

14

యెహోవా యొద్దనుండి నాకు వర్తమానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి.

15

జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.

16

నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.

17

ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.

18

సొదొమయుగొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.

19

చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్నవాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరియేడి?

20

ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాసస్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును.

21

వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.

22

శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.

ఆమోసు 1:11

యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.

ఆమోసు 1:12

తేమానుమీద అగ్ని వేసెదను , అది బొస్రాయొక్క నగరులను దహించివేయును .

ఓబద్యా 1:1

ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవాయొద్దనుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు.

ఓబద్యా 1:2-9
2

నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు.

3

అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.

4

పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.

5

చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చినయెడల తమకు కావలసినంతమట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల పరిగె యేరు కొనువారికి కొంత యుండనిత్తురుగదా; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయియున్నావు.

6

ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును; వారు దాచి పెట్టిన ధనమంతయు పట్టబడును.

7

నీతో సంధిచేసిన వారు నిన్ను తమ సరిహద్దువరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీయన్నముతిని నీ కొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచనలేకపోయెను.

8

ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములోనుండి జ్ఞానులను నాశముచేతును; ఇదే యెహోవా వాక్కు.

9

తేమానూ, నీ బలాఢ్యులు విస్మయమొందుదురు, అందువలన ఏశావుయొక్క పర్వతనివాసులందరు హతులై నిర్మూలమగుదురు.

మలాకీ 1:3

ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.

మలాకీ 1:4

మనము నాశనమైతివిు, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు.