
నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయ క్రియలు నాకు కనబడు చున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచు కొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?
నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను.
వ్యభిచరింపకూడదు.
నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.
వ్యభిచరింపకూడదు.
నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగువాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిద నైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.
ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.
ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి –ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా
దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.
నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;
నేను మీతో చెప్పునదేమనగా–ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.