పాడుడి
యెషయా 5:1-7
1

నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను

2

ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను.ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను

3

కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.

4

నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?

5

ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను

6

అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను.

7

ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

సంఖ్యాకాండము 21:17

అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి– బావీ ఉబుకుము. దాని కీర్తించుడి బావీ; యేలికలు దాని త్రవ్విరి

ఒక ద్రాక్షవనము
కీర్తనల గ్రంథము 80:8-19
8

నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి

9

దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపించెను

10

దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను.

11

దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను.

12

త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి ?

13

అడవి పంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి .

14

సైన్యములకధిపతివగు దేవా , ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము .

15

నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము.

16

అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు .

17

నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక.

18

అప్పుడు మేము నీ యొద్దనుండి తొలగిపోము నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము

19

యెహోవా,సైన్యములకధిపతివగు దేవా , చెరలోనుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము .

యిర్మీయా 2:21

శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటి తిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతాన మైతివి?

మత్తయి 21:33-46
33

మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను.

34

పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా

35

ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి.

36

మరల అతడు మునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.

37

తుదకు–నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.

38

అయినను ఆ కాపులు కుమారుని చూచి–ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని

39

అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.

40

కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయుననెను.

41

అందుకు వారు–ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్త కిచ్చునని ఆయనతో చెప్పిరి.

42

మరియు యేసు వారిని చూచి–ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా?

43

కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.

44

మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.

45

ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి

46

ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి.

లూకా 20:9-18
9

అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్ప సాగెను ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాల ముండెను.

10

పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్ద కొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపివేసిరి.

11

మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి.

12

మరల నతడు మూడవవాని పంపగా వారు వానిని గాయపరచి వెలుపలికి త్రోసివేసిరి.

13

అప్పుడా ద్రాక్షతోట యజమానుడు నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒక వేళ వారు అతని సన్మానించెద రనుకొనెను.

14

అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని

15

అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును?

16

అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి.

17

ఆయన వారిని చూచి ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి?

18

ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.