
యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు.
తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును.
ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
ఏలయనగా ఆకాశ మందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను.
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
ఆయన భూ మండలము మీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాసస్థలముగా ఏర్పరచెను.