బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగానుండును.
నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.
ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?
ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి యేరబడియున్నది
నీ వస్త్రములకొరకు గొఱ్ఱపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును
నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును.
దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.
సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,
మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.
దీర్ఘశాంతముగలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగాపొందును.
మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెననొందకపోవును.
చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.