భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును.
భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్థిల్లును.
నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన వారినందరిని చూచి వారిని క్రుంగజేయుము.
గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగద్రొక్కుము.
కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము.
శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును.
కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును.(సెలా.)
యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.
అహంకారాతిశయము గల ప్రతి దానికిని ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును .
అయితే అతడు మనస్సున అతిశయించి , బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసికొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను .
చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.
ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.
తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేనివారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునైయున్నాడు
దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు.
యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.