కోతపండుగ
నిర్గమకాండము 22:29

నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను.

నిర్గమకాండము 34:22

మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.

లేవీయకాండము 23:9-21
9

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

10

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.

11

యెహోవా మిమ్మునంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.

12

మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను

13

దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము.

14

మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టెయేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.

15

మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను.

16

ఏడవ విశ్రాంతిదినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను.

17

మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.

18

మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.

19

అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాపపరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను.

20

యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకునివగును.

21

ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

సంఖ్యాకాండము 28:26-31
26

మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.

27

యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱ పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను

28

నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

29

ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

30

మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను.

31

నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.

ద్వితీయోపదేశకాండమ 16:9-12
9

ఏడు వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని యేడు వారములను లెక్కించి

10

నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది దాని నియ్యవలెను.

11

అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్యనున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.

12

నీవు ఐగుప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకముచేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను.

అపొస్తలుల కార్యములు 2:1

పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

కూర్చుకొనిన
నిర్గమకాండము 34:22

మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.

లేవీయకాండము 23:34-44
34

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.

35

వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

36

ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

37

యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు, మీ మ్రొక్కుబడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమద్రవ్యమునేమి దహనబలిద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామకకాలములు ఇవి.

38

ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొనిరావలెను.

39

అయితే ఏడవ నెల పదునయిదవ మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతిదినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.

40

మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజిచెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.

41

అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను.

42

నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను.ఇశ్రాయేలీయులలో పుట్టినవారందరు పర్ణశాలలలో నివసింపవలెను.

43

నేను మీ దేవుడనైన యెహోవాను.

44

అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామకకాలములను తెలియచెప్పెను.

సంఖ్యాకాండము 29:12-39
12

మరియు ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను.

13

నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను.

14

నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

15

ఆ పదునాలుగు గొఱ్ఱపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా

16

ఒక మేక పిల్లను అర్పింవలెను.

17

రెండవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధిప్రకారముగా,

18

వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును

19

పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

20

మూడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను

21

విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱ పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను

22

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

23

నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,

24

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను

25

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

26

అయిదవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమి్మది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

27

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱ పిల్లలతోను

28

వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

29

ఆరవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

30

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

31

పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

32

ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

33

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

34

పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

35

ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగానుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయకూడదు.

36

అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

37

ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱపిల్లలతోను

38

వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

39

మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.

ద్వితీయోపదేశకాండమ 16:13-15
13

నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.

14

ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను.

15

నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.

నెహెమ్యా 8:14-18
14

యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడియుండుట కనుగొనెను

15

మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.

16

ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమ తమ యిండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.

17

మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను.

18

ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అను దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును ఏడు దినములవరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి.

జెకర్యా 14:16-19
16

మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.

17

లోక మందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేము నకు రాని వారందరిమీద వర్షము కురువ కుండును .

18

ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రా కయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును , పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును .

19

ఐగుప్తీయులకును , పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనుల కందరికిని రాగల శిక్ష యిదే .

యోహాను 7:2

యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక

యోహాను 7:37

ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.