
యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొనియున్నావు
నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.
నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.
వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు.
ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.
నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేననుకొనిన యెడల
చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగైయుండలేదు
నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.
దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది.
వాటిని లెక్కించెదననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును.
దేవా,నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి.
వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము చేయుదురు.
యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించుచున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా?
వారియందు నాకు పూర్ణద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను
దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము
నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.
ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా
దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?
ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టిచూచుచున్నాడు.
దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.
ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీ క్షించువాడను.
యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యా కాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలియును, ఇశ్రాయేలీయులు తెలిసికొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగుబాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి.
యెహోవాను అనుసరింపక తొలగిపోయి, దహనబలినైనను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకే గాని సమాధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టినయెడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువుచేతనే ఈ బలిపీఠమును కట్టితివిు.
గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.
దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దిన మందు ఈలాగు జరుగును.
కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చువరకు, దేనిని గూర్చియు తీర్పుతీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.