భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను.
అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.
నేను దేవుని పరిశుద్ధస్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.
నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు
క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు.
వరదచేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు . ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు
ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును .
నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు . చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు .
సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.
వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును
కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు.
ఆదినుండి నరులు భూమిమీదనుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?
వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను
తమ మలము నశించు రీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు.వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.
కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు.
వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు
ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.