నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.
నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి.
నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.
యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి.
యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది , ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది.
నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.
యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను నన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా
వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము.
యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన యెడల
నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా.(సెలా.)
నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.
నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీటనియ్యకుము.
నా శత్రువులు చురుకైనవారును బలవంతులునై యున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు.
నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాపమునుబట్టి కాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడియున్నారు.
నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.
వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.
నేను శ్రమలపాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నారక్షణకర్తవు నీవే యెహోవా, ఆలస్యము చేయకుమీ.
నా కుడిప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు.
యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.
నేను చాలా క్రుంగియున్నాను నా మొఱ్ఱకు చెవి యొగ్గుము నన్ను తరుమువారు నాకంటె బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము.
యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము