
మరియు లేవిక్రమము చూడగా చావునకులోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యముపొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.
అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను.
ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.
ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణ సిద్ధికలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?
ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును.
ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోనివాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్యచేయలేదు.
మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు.
మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,
మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.
ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవైయున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.
ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడియున్నది;
అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము.
మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను.
వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవైయున్నావని ప్రభువు ప్రమాణము చేసెను;
ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.
మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని
ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయెను.
ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.
యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును ; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును , అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును , అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజకత్వము జరిగించును .