
ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,
అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవకృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,
నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము.
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
మన పౌరస్థితి పరలోకము నందున్నది ; అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము .
మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.
దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.
తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మములున్నవి.
ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.
ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడువాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,
అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.
దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.
దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమైయున్నారు.
ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.
జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.
జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను.
భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.