మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ యిండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.
నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిపెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారముచేసి, నీకును నీ యింటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింపవలెను.
జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితదినమని జనులతో చెప్పిరి.
మరియు అతడు వారితోనిట్లనెను పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానముచేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధముచేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.
ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి మీరు దుఃఖము మానుడి,ఇది పరిశుద్ధదినము,మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి.
ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి.
నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను.
ఆ దినమున మీరీలాగందురు యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించియున్నావు.
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు
యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి.
యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును.
సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.
ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.
సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును
మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును.
వారి తలల మీద నిత్యా నందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును .
ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;