నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.
మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.
ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్కచొప్పున దాని తీసికొనవలెను.
ఆ గొఱ్ఱపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.
నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱలలోనుండియైనను మేకలలోనుండియైనను దాని తీసికొనవచ్చును.
ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచుకొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపువారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి
ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను
దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను;
దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను.
మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.
ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలిసంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను.
మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.
ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసినదానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.
ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.
పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.
మొదటి నెల పదునాలుగవదినము సాయంకాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.
ఏడు దినములు మీ యిండ్లలో పొంగినదేదియును ఉండకూడదు, పులిసినదానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టినవాడేగాని ఇశ్రాయేలీయుల సమాజములోనుండక కొట్టివేయబడును.
మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియనివాటినే తినవలెనని చెప్పుమనెను.
మీరు పొంగనివాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.
మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.
ఇశ్రాయేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.
దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.
కాబట్టి మోషే పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదు నాలుగవ దినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి.
మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.
అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీయొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలనందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతముచేసెను.
ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.
ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలువెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.
మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొనిపోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.
ఐగుప్తీయులు మనమందరము చచ్చినవారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.
కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టుకొని, తమ భుజములమీద పెట్టుకొనిపోయిరి.
ఇశ్రాయేలీయులు మోషే మాటచొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.
యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.
అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.
వారు ఐగుప్తులోనుండి తెచ్చిన పిండిముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయలేకపోయిరి గనుక అది పులిసియుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొనియుండలేదు.
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.
ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిపోయెను.
ఆయన ఐగుప్తుదేశములోనుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.
ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి గదా.
పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.
మీరు పొంగనివాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.