రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి , తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.
అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు , కామవిలాసములైనను పోకిరిచేష్టలైనను లేకయు , కలహమైనను మత్సరమైనను లేకయు , పగటి యందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము .
మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనినవారై , శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి .
మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
ఈ గుడారములోనున్న మనము భారముమోసికొని మూల్గుచున్నాము.
ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము.
క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.
నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము.