
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.
కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను
తిరుగుబాటును మాన్పుటకును , పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతమువరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును , అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును , నీ జనము నకును పరిశుద్ధ పట్టణము నకును డెబ్బది వారములు విధింపబడెను .
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి.
సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి -ఆమేన్;
యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.
పెద్దలలో ఒకడు -తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.
అందుకు నేను - అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను -వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;
వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.