
ఇందుకే గదా మీరు పన్ను కూడ చెల్లించుచున్నారు ? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును , ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును , ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి .
నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను.
సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్యవలెను. వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టుకొనియుండును. వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టునేమో అది నీకు పాపమగును.
మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.
కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.
ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే .
ధర్మశాస్త్రమంతయు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.
వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.
ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.
మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.