
మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.
అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.
మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాటలాడెను.
అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీపింపగా సీనాయికొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారి కాజ్ఞాపించెను.
మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖముమీద ముసుకు వేసికొనెను.
అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చువరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడినదానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను.
మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.
జ్ఞానులతో సములైనవారెవరు? జరుగువాటి భావమును ఎరిగినవారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును, దానివలన వారి మోటుతనము మార్చబడును.
అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.
ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను,ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.
ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?
మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.