ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను .
యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వ శరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు .
ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవా డితడే.
ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి
ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును
సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను.
యోహాను ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచునా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను.
నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే.
అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను.
కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను.
నీవు ఆ ప్రవక్తవా అని అడుగగాకానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారునీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనినడిగిరి
అందుకతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.
పంపబడినవారు పరిసయ్యులకు చెందిన వారు
వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్తవైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా
యోహాను నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;
మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.
యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.
మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచిఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.
నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన.
నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలొ బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను.
మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.
నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడునీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను.
ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను.
నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు.
పెండ్లికుమార్తెగలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమై యున్నది.
ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది.
పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చువాడు అందరికి పైగానుండి
తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు.
ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు.
ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి యున్నాడు.
కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.