అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవా ఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను.
మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపు కొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.
అయితే వారును మా పితరులును గర్వించి, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి.
వారు విధేయులగుటకు మనస్సులేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచుకొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునైయుండి వారిని విసర్జింపలేదు.
లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.
ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై
నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.
అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.
వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.
వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.
కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.