దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,
యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షల కొరకై బీదవారిని అమ్మి వేయుదురు.
నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొనకూడదు.
వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను.
అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను.
ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించితిని; దాసులను అమి్మనట్లు వారిని అమ్మకూడదు;
తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి.
ఏదనగా కొందరు మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకులము. అందుచేత మేము తిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసికొందుమనిరి.
మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువపెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందుమనిరి.
మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పుచేసితివిు.
మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసివచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశముననుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా
వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా?
యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి; మీరు చేసినదానిని బహుత్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను.