యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొఱ్ఱల మందలోనుండి గాని మేకలమందలోనుండి గాని దానిని తీసికొనిరావలెను.
అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగదానిని తీసికొనిరావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.
అతడు దహనబలిగాఅర్పించు పశువుతలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.
అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.
అప్పుడతడు దహనబలిరూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాత
యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను.
అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను.
అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను.
దహనబలిగా అతడు అర్పించునది గొఱ్ఱలయొక్కగాని మేకలయొక్క గాని మందలోనిదైన యెడల అతడు నిర్దోషమైన మగదాని తీసికొనివచ్చి
బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠముమీద నున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను.
దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.
అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షిజాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలోనుండిగాని పావురపు పిల్లలలోనుండిగాని తేవలెను.
యాజకుడు బలిపీఠముదగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను.
మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట దానిని పారవేయవలెను.
అతడు దాని రెక్కలసందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠముమీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.
నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము ఇది దహనబలినిగూర్చిన విధి. దహనబలిద్రవ్యము ఉదయమువరకు రాత్రిఅంతయు బలిపీఠముమీద దహించుచుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించుచుండును.
యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠముమీద అగ్ని దహించు దహనబలిద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి
తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొనిపోవలెను.
బలిపీఠముమీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలువేసి, దానిమీద దహనబలిద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను.
బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.
నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసిన దేమనగా , ఏడాదివి రెండు గొఱ్ఱపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱపిల్లను
సాయంకాల మందు ఒక గొఱ్ఱపిల్లను అర్పింపవలెను .
దంచితీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను . సాయంకాల మందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను .
అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను .
ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి . నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును .
ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి
యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులోనుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలిపీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.
ఆ నైవేద్యశేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.
నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమపిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను.
నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను.
అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను.
నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన యెడల నూనె కలిసిన గోధుమపిండితో దానిని చేయవలెను.
వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవాయొద్దకు తేవలెను. యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను
అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను.
ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.
మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగినదానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు.
ప్రథమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠముమీద ఇంపైన సువాసనగా వాటి నర్పింపవలదు.
నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.
నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను.
అది నైవేద్యరూపమైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను.
అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.
నైవేద్యమునుగూర్చిన విధి యేదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని నర్పించవలెను.
అతడు నైవేద్యతైలమునుండియు దాని గోధుమపిండినుండియు చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలోనుండి తీసి జ్ఞాపకసూచనగాను వాటిని బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను.
దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపుగుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను;
దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము.
అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతివస్తువు పరిశుద్ధమగును.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనివిషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైన యెడల, ఎట్లనగా
ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసినయెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.
అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొనివచ్చి కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను
అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను.
ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధమందిరము యొక్క అడ్డ తెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను.
అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడెయొక్క రక్తశేషమంతయు పోయవలెను.
మరియు అతడు పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె క్రొవ్వుఅంతయు దానినుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని
మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులపైనున్న కాలేజముమీది వపను
సమాధానబలియగు ఎద్దునుండి తీసినట్లు దీనినుండి తీయవలెను. యాజకుడు దహనబలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను.
ఆ కోడెయొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ
పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.
ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల
వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు, సంఘము పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.
సమాజముయొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను.
అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెయొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసికొనిరావలెను.
ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెరవైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను.
మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.
మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను.
అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణకలుగును.
ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరిహారార్థబలి.
అధికారి పొరబాటున పాపముచేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల
అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి
ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించుచోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.
ఇది పాపపరిహారార్థబలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ముల మీద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను.
సమాధానబలి పశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణకలుగును.
మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరానిపనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల
తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడిన యెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి
పాపపరిహారార్థబలి పశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను.
యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను.
మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.
ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱను తీసికొనివచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి
పాపపరిహారార్థబలియగు ఆ పశువు తలమీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాపపరిహారార్థబలియగు దానిని వధింపవలెను.
యాజకుడు పాపపరిహారార్థబలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.
మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపమువేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుము పాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలిరూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతి పరిశుద్ధము.
పాపపరిహారార్థబలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను.
దాని మాంసమునకు తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను.
దాని వండిన మంటికుండను పగులగొట్టవలెను; దానిని ఇత్తడిపాత్రలో వండినయెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను.
యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.
మరియు పాపపరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.
అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా
దహనబలి పశువులను వధించుచోట అపరాధపరిహారార్థబలిరూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
దానిలోనుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును
రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది క్రొవ్వును కాలేజముమీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను.
యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను;
అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తముచేయు యాజకునిదగును.
ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియైయుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును.
మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినయెడల, అది అపవిత్రమృగ కళేబరమేగాని అపవిత్రపశు కళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడుజంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును.
మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండ అంటినయెడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగినయెడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధియగును.
మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన యెడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును.
కాబట్టి అతడు వాటిలో ఏవిషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని
తాను చేసిన పాపవిషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును.
అహరోనుకు అభిషేకముచేసిన దినమున, అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమపిండిలో పదియవవంతు.
పెనముమీద నూనెతో దానిని కాల్చవలెను; దానిని కాల్చినతరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్యభాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను.
అతని సంతతివారిలో అతనికి మారుగా అభిషేకముపొందిన యాజకుడు ఆలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలెను.
యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను; దాని తినవలదు.
వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా
ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా
వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంటలను అర్పింపవలెను.
ఆ పిండివంటలేకాక సమాధానబలిరూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.
మరియు ఆ అర్పణములలో ప్రతిదానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.
సమాధానబలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.
అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను.
మిగిలినది మరునాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలినదానిని అగ్నితో కాల్చివేయవలెను.
ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును.
అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చును గాని
ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహోవాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను తినినయెడల వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.
ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్రమైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలి పశువుమాంసమును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.
అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొనివచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైనదానిని తీసికొనిరావలెను.
తాను అర్పించుదాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
అతడు ఆ సమాధాన బలి పశువుయొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని రెండు మూత్రగ్రంధులను వాటిమీదను
డొక్కలమీదనున్న క్రొవ్వును కాలేజముమీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింవలెను.
అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగలహోమము.
యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱ మేకలలోనిదైనయెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొనిరావలెను.
అతడర్పించు అర్పణము గొఱ్ఱపిల్లయైన యెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొనిరావలెను.
తాను అర్పించుదాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
ఆ సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని
రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది కాలేజముయొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను.
యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము.
అతడు అర్పించునది మేకయైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొనిరావలెను.
తాను దాని తలమీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని
రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్రగ్రంథులపైనున్న కాలేజముయొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను.
యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు.
అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.