మరియు ఏడవ
లేవీయకాండము 23:33-43
33

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

34

–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.

35

వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

36

ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

37

యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కుబడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యము నేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి.

38

ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొనిరావలెను.

39

అయితే ఏడవ నెల పదునయిదవ దినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతిదినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.

40

మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.

41

అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను.

42

నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను.ఇశ్రాయేలీయులలో పుట్టినవారందరు పర్ణశాలలలో నివసింపవలెను.

43

నేను మీ దేవుడనైన యెహోవాను.

సంఖ్యాకాండము 29:12-38
12

మరియు ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను.

13

నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను.

14

నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

15

ఆ పదునాలుగు గొఱ్ఱపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా

16

ఒక మేక పిల్లను అర్పింవలెను.

17

రెండవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధిప్రకారముగా,

18

వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును

19

పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

20

మూడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను

21

విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱ పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను

22

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

23

నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,

24

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను

25

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

26

అయిదవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమి్మది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

27

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱ పిల్లలతోను

28

వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

29

ఆరవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

30

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

31

పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

32

ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

33

ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

34

పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

35

ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయకూడదు.

36

అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

37

ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱపిల్లలతోను

38

వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

ద్వితీయోపదేశకాండమ 16:13-15
13

నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.

14

ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను.

15

నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.

2 దినవృత్తాంతములు 5:3

ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి.

2 దినవృత్తాంతములు 7:8-10
8

ఆ సమయమందు సొలొమోనును, అతనితో కూడ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నదివరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరును ఏడు దినములు పండుగ ఆచరించి

9

యెనిమిదవనాడు పండుగ ముగించిరి; ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ఠచేయుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.

10

ఏడవ నెల యిరువది మూడవ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును, ఎవరి గుడారములకు వారు వెళ్లునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను.

నెహెమ్యా 8:14-18
14

యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడియుండుట కనుగొనెను

15

మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.

16

ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమ తమ యిండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.

17

మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను.

18

ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అను దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును ఏడు దినములవరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి.

జెకర్యా 14:16-19
16

మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.

17

లోక మందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేము నకు రాని వారందరిమీద వర్షము కురువ కుండును.

18

ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రా కయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును, పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును.

19

ఐగుప్తీయులకును, పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనుల కందరికిని రాగల శిక్ష యిదే.

యోహాను 7:2

యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక

యోహాను 7:37-39
37

ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి–ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.

38

నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.

39

తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.