
ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండచేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును.
సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండ కుండ చేసెదను.
క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను
ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను.
పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను
నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడియున్నది.
ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో ఆనందము లేదు.
పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను.
ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారానాద మికను వినబడదు,
దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామకకాలములను మాన్పింతును .
నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదువారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,
దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.