యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని ? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.
యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.
ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని యున్నారు.
భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.
మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.
వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.
కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.
వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.
ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.
మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమునుబట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాస ఘాతకులైనందున నేను వారికి పరాజ్ముఖుడనై వారు ఖడ్గముచేత కూలునట్లుగా వారిని బాధించువారికి అప్పగించితిననియు అన్యజనులు తెలిసికొందురు.
వారి యపవిత్రతను బట్టియు అతిక్రమ క్రియలనుబట్టియు నేను వారికి పరాజ్ముఖుడనై వారికి ప్రతికారము చేసితిని.
అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
వారు దుర్మార్గత ననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవా కు మొఱ్ఱపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును .