అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గ మనబడును అది అపవిత్రులు పో కూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు
అక్కడ సింహ ముండదు క్రూర జంతువులు దాని ఎక్కవు , అవి అక్కడ కన బడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు
వారి తలల మీద నిత్యా నందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును .
జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.