ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరును ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి.
అంతట దావీదు మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.
దావీదును ఇశ్రాయేలీయులందరును తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి.
ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధమైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి,
వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాటకులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములో నుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి.
శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రముచేసిరి
వీరు వంతుచొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.
సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.
యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజైయున్నాడు.
ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును.
తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు.
దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను.
కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.
బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.