దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకువాటన్నిటిలోను,
మరియు నీతోకూడ వాటిని బ్రదికించియుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలోనివి రెండేసిచొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను.
నీవు వాటిని బ్రదికించియుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును.
మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.
అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి భూమిమీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును;
జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చును గాని
నెమరువేయువాటిలోను రెండు డెక్కలుగలవాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.
పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.
కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.
పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.
వాటి మాంసమును మీరు తినకూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.
జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములో నేమి, నదులలో నేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.
సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నియు మీకు హేయములు;
అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంస మును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను.
నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.
పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,
క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,
రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరములన్నియు మీకు హేయములు.
అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును.
నేతమిడతగాని చిన్నమిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును.
నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.
వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.
వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరువేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును.
నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;
వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును; అవి మీకు అపవిత్రమైనవి.
నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతివిధమైన బల్లి,
ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక.
ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
వాటిలో చచ్చినదాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్రమగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమే గాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్రమగును.
వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగులగొట్టవలెను.
తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.
వాటి కళేబరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్రమగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను.
అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును.
వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనములమీద పడినను అవి అపవిత్రములు కావు గాని
ఆ విత్తనములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.
మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చినయెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.
నేలమీద ప్రాకు జీవరాసులన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు.
ప్రాకు జీవరాసులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.
నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులైయుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.
నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.
అపవిత్రమైనదానికిని పవిత్రమైనదానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు
జంతువులనుగూర్చియు, పక్షులను గూర్చియు, జలచరములైన సమస్త జీవులను గూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధియిదే అని చెప్పుమనెను.
మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడిచేసికొనకూడదు.
ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టిత జనము. మరియు యెహోవా భూమిమీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను.
నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవేవనగా
ఎద్దు, గొఱ్ఱపిల్ల, మేక పిల్ల,
దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱ అనునవే.
జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును.
నెమరువేయు వాటిలోనిదే కాని రెండు డెక్కలుగల వాటిలోనిదే కాని నెమరువేసి ఒంటిడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు.
మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు.
నీట నివసించువాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చుననగా, రెక్కలు పొలుసులుగలవాటినన్నిటిని తినవచ్చును.
రెక్కలు పొలుసులు లేనిదానిని మీరు తినకూడదు అది మీకు హేయము.
పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును.
మీరు తినరానివి ఏవనగాపక్షిరాజు,
పెద్ద బోరువ, క్రౌంచుపక్షి,
పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద,
ప్రతి విధమైన కాకి,
నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల,
ప్రతి విధమైన డేగ, పైడికంటె,
గుడ్లగూబ, హంస, గూడ బాతు,
తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి.
ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును.
చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను.
అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకు పురుగులును, ఆకాశపక్షులును ఉండెను.
అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను.
అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా
దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను.
మీరు ప్రతిష్ఠింపబడినదానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదానినుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును,
ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితముకానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు