
ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీయులచేతికి అప్పగించెను.
సౌలు ముప్పది ఏండ్లవాడై యేలనారంభించెను. అతడు రెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను.
ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచుకొనెను. వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్దనుండిరి; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతానునొద్దనుండిరి; మిగిలినవారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను.
యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతముచేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను; మరియు దేశమంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను.
సౌలు ఫిలిష్తీయుల దండును హతముచేసి నందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడివచ్చిరి.
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.
యోనాతాను -ఈ సున్నతిలేనివారి దండు కాపరులమీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయు వానితో చెప్పగా
అతడు-నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. నీ యిష్టాను సారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను.
అప్పుడు యోనాతాను -మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము.
వారు మనలను చూచి-మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన యెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము.
మాయొద్దకు రండని వారు చెప్పిన యెడల యెహోవా వారిని మనచేతికి అప్పగించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా
వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులు -చూడుడి, తాము దాగియుండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు
యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి-మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను -నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి
అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతుల తోను కాళ్ల తోను ప్రాకి యెక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను.
యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువది మంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అర యెకరము నేల పొడుగున అది జరిగెను.
దండులోను పొలములోను జను లందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతినొందిరి; నేల యదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.
దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగులవారికి కనబడగా
తానును తనయొద్ద నున్న జను లందరును కూడుకొని యుద్ధము నకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసికొను చుండిరి.
మరియు అంతకుమునుపు ఫిలిష్తీయుల వశముననున్నవారై చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితోకూడ దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలీయు లతో కలిసికొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి.
అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి.
ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి.
తన సంచి లో చెయ్యి వేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను.
దావీదు ఫిలిష్తీయుని కంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను.
వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి.
అప్పుడు ఇశ్రాయేలు వారును యూదావారును లేచి -జయము జయమని అరచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి.
అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి.
సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములోనుండి వెళ్లగొట్టి యుండెను.
ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా, సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చెను; వారు గిల్బోవలో దిగిరి.
సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది
అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుటనుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమువరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు
సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.
యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు
సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను.
సౌలు మరణమాయెనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడ మరణమాయెను.
ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులును అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి.
లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులును , యొర్దాను అవతల నున్నవారును, ఇశ్రాయేలీయులు పారిపోవుటయు, సౌలును అతని కుమారులును చచ్చియుండుటయు చూచి తమ నివాసగ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి.