
తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.
అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.
అందుకు యేసు – మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని–చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.
ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.
నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు.
ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.
మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి.
ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా?
ఆయన చిత్త మెరిగి, ధర్మశాస్త్ర మందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా?
జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి -నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,
చీకటి లో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?
ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?
వ్యభిచరింప వద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?
ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపరచెదవా?
ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాప మగు నిమిత్తము, అది నాకు మరణకర మాయెను.