నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడదిగగా
ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను.
అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను చూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను.
మీరందరు యుద్ధసన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగవలెను.
ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను.
మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను.
నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను.
మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను.
యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారివెంట నడిచెను.
యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి.
మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.
అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి.
ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి.
ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి.
అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములు వారు ఆలాగు చేయుచువచ్చిరి.
ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆ ప్రకారముగానే పట్టణముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి
ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను కేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు.
ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు.
శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.
వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.
యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.
వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరిని యెద్దులను గొఱ్ఱలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి.
అయితే యెహోషువ ఆ వేశ్యయింటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగినవారినందరిని అక్కడనుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన యిద్దరు మనుష్యులతో చెప్పగా
వేగులవారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగినవారినందరిని వెలుపలికి తోడుకొని వచ్చిరి; ఆమె యింటివారినందరిని వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెమువెలుపట వారిని నివసింపజేసిరి.
అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి; వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుపపాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో నుంచిరి.
రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి యుండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి యింటివారిని ఆమెకు కలిగినవారినందరిని బ్రదుకనిచ్చెను. ఆమె నేటివరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది.
అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.
వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ల వద్దని నేను మీతో చెప్ప లేదా అని వారితో అనెను .
అంతట ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివికావు . అందుచేత భూమియు నిస్సారమై యున్నదని ఎలీషాతో అనగా
అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను . వారు దాని తీసికొని రాగా
అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పు వేసి , యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగుచేసి యున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును . భూమియు నిస్సారముగా ఉండదు అనెను .
కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది .