
కాకుల సంగతి విచారించి చూడుడి . అవి విత్తవు , కోయవు , వాటికి గరిసె లేదు , కొట్టు లేదు ; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు ; మీరు పక్షుల కంటె ఎంతో శ్రేష్ఠులు .
వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు
అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ ముగా వస్త్రములు ధరింపజేయును గదా.
ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
షేబ దేశపురాణి యెహోవా నామమును... గూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను.
ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా
ఆమె వేసిన ప్రశ్నలన్నిటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను; రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసినవాటన్నిటి భావము చెప్పెను.
షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును,
అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై
రాజుతో ఇట్లనెను నీ కార్యములనుగూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే;
అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి;
నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు
నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను.
మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు.
మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను.
ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు.
సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినది పోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.
సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను.
షేబ దేశపురాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,
అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయమొంది రాజుతో ఇట్లనెను
నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.
నీ యధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది.
నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.
నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను.
ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను; షేబదేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు.
ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములనుకూడ కొనివచ్చిరి.
ఆ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సౌపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు.
షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములుగాక ఆమె మక్కువ పడి అడిగిన దంతయు రాజైన సొలొమోను ఆమె కిచ్చెను; తరువాత ఆమె తన సేవకులను వెంట బెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను.